చావుకేమొ చేరువై
కన్నబిడ్డలకు భారమై
వారి ప్రేమకు దూరమై
కుములుతాము వృద్ధులై
వారి మనసులు క్రూరమై
తరిమేస్తె మూర్ఖులై
బుక్కడంత కూడుకై
అలమటిస్తిమి ఆకలై
కుక్క నాడు చేరువై
వారితో పాటు పెద్దదై
నమ్మకానికి రూపమై
చెంతనుంది ఆప్తుడై
బిడ్డలని పెంచడమే పాపమై
భిక్షాటన మాకు మార్గమై
బ్రతుకే మాకు భారమై
బాధపడితిమి ఒంటరై
కంటిచూపు పలచనై
కర్ర మాకు సాయమై
నడిపించును నేస్తమై
అవసానంలో ఆప్తుడై
నేడు మాకు చీకటై
రేపు మాకు శూన్యమై
మనుగడే మాకు కష్టమై
అలమటిస్తిమి సేదకై
కన్నబిడ్డల ప్రేమకై
వారి పిల్లల పిలుపుకై
ఆదరించే చేతికై
ఆశపడితిమి ఒంటరై
-రమేష్
No comments:
Post a Comment